Home  »  » ప్రముఖ హీరోయిన్‌, సింగర్‌ మృతి.. ఆ హీరో కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది!



- హేమమాలిని ప్రేమలో సంజీవ్ కుమార్

- సంజీవ్ కుమార్‌ని ప్రేమించిన సులక్షణ

- ప్రేమ కోసం జీవితాలను త్యాగం చేసిన హీరో, హీరోయిన్

చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. వివిధ శాఖల్లో ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కళాకారులు కనుమరుగైపోయారు. అలాంటి ఓ అరుదైన నటి, సింగర్‌ గురువారం తుదిశ్వాస విడిచారు. 1970 నుంచి 1980 వరకు తన నటనతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నటీమణి సులక్షణ పండిట్‌. రాజేష్‌ ఖన్నా, సంజీవ్‌ కుమార్‌, శశికపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, జితేంద్ర, వినోద్‌ ఖన్నా, శత్రుఘ్నసిన్హా వంటి టాప్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న సులక్షణ.. మంచి సింగర్‌ కూడా.

దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన సులక్షణ.. 50కి పైగా పాటలు పాడారు. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. నటిగా ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. ముంబైలో నివాసం ఉంటున్న సులక్షణకు నవంబర్‌ 6 రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో సోదరుడు లలిత్‌ పండిట్‌ ఆమెను అక్కడికి దగ్గరలో ఉన్న నానావతి హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. సులక్షణ వయసు 71 సంవత్సరాలు. ఆమె మరణం పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. 

చాలా తక్కువ సమయంలో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా సింగర్‌గా తన పాటలతో అందర్నీ అలరించారు సులక్షణ. అదృష్టం వెంటే దురదృష్టం కూడా ఉంటుందని సులక్షణ పండిట్‌ జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. నటిగా, సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కెరీర్‌లో ఎదిగే ప్రయత్నాలు తక్కువగా చేశారు సులక్షణ. దాంతో ఆమె ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తన కెరీర్‌పై ఎక్కువగా దృష్టి పెట్టకపోవడానికి ప్రధానం కారణం.. ఒక బాలీవుడ్‌ హీరోని ప్రేమించడమే. అతన్ని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పి గృహిణిగా జీవితాన్ని గడపాలనుకున్నారు. ఆ హీరో ఎవరో కాదు, సంజీవ్‌ కుమార్‌. 

ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన సంజీవ్‌ కుమార్‌తో కలిసి తన కెరీర్‌ ప్రారంభంలో ‘ఉల్జా’ అనే సినిమాలో నటించారు సులక్షణ. ఆ సమయంలోనే అతనిపై విపరీతమైన ప్రేమను పెంచుకుంది. అయితే అతనికి మాత్రం హేమమాలిని ఎంతో ప్రేమ. ఈ విషయం తెలిసి సులక్షణ ఎంతో బాధపడ్డారు. హేమమాలినిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు సంజీవ్‌. కానీ, ఆమె అంగీకరించలేదు. దీంతో సంజీవ్‌ ఎంతో మనోవేదనకు గురయ్యారు. ఆ సమయంలోనే తన ప్రేమ విషయాన్ని అతనికి తెలియజేసింది సులక్షణ. కానీ, అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. 

హేమమాలిని తన ప్రేమను తిరస్కరించడంతో సంజీవ్‌కుమార్‌ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. అలాగే సంజీవ్‌ తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో సులక్షణ పండిట్‌ కూడా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగానే ఉన్నారు. మనం సినిమాల్లో మాత్రమే చూసే ఇలాంటి ప్రేమ కథలు సినిమా వారి జీవితాల్లో జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. 1985 నవంబర్‌ 6న 47 ఏళ్ళ వయసులో సంజీవ్‌కుమార్‌ మరణించారు. అతన్ని తప్ప మరొకరిని ప్రేమించని సులక్షణ అతన్ని తలుచుకుంటూనే జీవితాన్ని గడిపారు. అందర్నీ షాకింగ్‌కి గురిచేసే మరో విషయం ఏమిటంటే.. సులక్షణ పండిట్‌ కూడా నవంబర్‌ 6నే చనిపోవడం. తను ప్రేమించిన వ్యక్తి తిరస్కరిస్తే.. మరొకరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోవడం అనేది సినిమాల్లో తప్ప నిజజీవితంలో మనం చూడలేం. కానీ, సంజీవ్‌కుమార్‌, సులక్షణ పండిట్‌ విషయంలో అది జరిగింది.